కాంగ్రెస్ ప్రచార వాహనాన్ని అడ్డుకుని, డ్రైవర్‌పై చేయిచేసుకుని సీఐ హల్చల్ - వీడియో వైరల్ - కొండా సురేఖ లెటెస్ట్ కామెంట్స్
Published : Nov 20, 2023, 1:14 PM IST
CI Attack on Congress Campaign Chariot Driver Viral Video : కాంగ్రెస్ పార్టీ ప్రచార రథంపై సీఐ దురుసుగా ప్రవర్తించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార రథం తిరుగుతుండగా.. మిల్స్ కాలనీకి చెందిన సీఐ ప్రచార రథాన్ని అడ్డుకొని, డ్రైవర్‌పై దుర్భాషలాడటంతో పాటు చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా సదరు వాహనాన్ని ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొనగా వరంగల్ ఏసీపీ బోనాల కిషన్.. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాహనాన్ని వదిలేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన విరమించారు.
Police Stopped Congress Party Campaign Vehicle : ఇదిలా ఉండగా.. గత 2 రోజులుగా సీఐపై అనేక ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ.. సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని స్థానిక సీఐ సురేశ్‌తో పాటు.. ఇంతేజార్గంజ్ సీఐ శ్రీనివాస్‌పై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, ఇరువురిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా కోరారు. లేనిపక్షంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఆదివారం రాత్రి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇంటి వద్ద చేతి పంపు నిర్మాణ పనులను కొండా సురేఖ అడ్డుకోగా.. మిల్స్ కాలనీకి చెందిన సీఐ.. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు దుర్భాషలాడారని.. తాజాగా ఇంతేజార్గంజ్ సీఐ.. పలువురు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని కొండా సురేఖ ఆరోపించారు. గత రెండు రోజులుగా జరిగిన ఘటనలపై ఏసీపీ బోనాల కిషన్ వివరణ ఇచ్చారు. తాము సమన్వయం పాటిస్తున్నామని.. తమ ఓపికను పరీక్షిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 17 కేసులు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.