Leopard Spotted at KCR Urban Park : కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లో చిరుత సంచారం - Chirutha
Leopard Spotted at Gol Bangla Watch Tower : మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లోని గోల్ బంగ్లా వద్ద.. చిరుత సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ ట్రామ్ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అర్బన్ ఎకో పార్కుకు సంబంధించిన గోల్ బంగ్లాను ఇటీవలే ఆధునీకరించి వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. అది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సాధారణంగా వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. తొమ్మిదేళ్లుగా అడవులను సంరక్షించడం వల్లే వణ్య ప్రాణుల సంచారం పెరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏటా 50 లక్షలు, గతేడాది కోటి విత్తన బంతులను వెదజల్లి.. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లో పచ్చదనం పెంచినట్లు తెలిపారు. ఆ కారణంగానే అర్బన్ ఎకో పార్క్‌కు వణ్యప్రాణుల రాక పెరిగిందని చెప్పారు.
Mahbubnagar KCR Urban Park : మొదట్లో మయూరి నర్సరీగా ఉన్న దానిని 2016లో మయూరి పార్కుగా మార్చి.. రూ.80 కోట్లతో 232 ఎకరాల్లో మయూరి ఎకో అర్బన్ పార్కుగా తీర్చిదిద్దారు. దీంతోపాటు మహబూబ్‌నగర్, నవాబుపేట, జడ్చర్ల, హన్వాడ మండలాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ భూములన్నింటినీ కలుపుకొని పార్కును అభివృద్ధి చేశారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న ఈ పార్కుకు కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుగా పేరు మార్చారు. ఈ పార్కును 2020 జూలై 13న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.