వివేకా కేసు - సీబీఐ ఎస్పీ రామ్సింగ్తో సహా వైఎస్ సునీతపై పోలీసుల ఛార్జిషీట్ - వివేకా హత్య కేసు తాజా
Published : Dec 29, 2023, 10:25 PM IST
|Updated : Dec 30, 2023, 6:32 AM IST
Charge Sheet on YS Sunitha CBI SP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కుమార్తె, అల్లుడిపై పోలీసులు పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నెల 15న వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో వేధిస్తున్నారని రెండేళ్ల క్రితం కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. జనవరి 4 లోగా తుది నివేదిక ఇవ్వాలనే కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
సీబీఐ అధికారులు తనను వేదిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ చేయాలని పలుమార్లు దిల్లీతో పాటు పులివెందులకు పిలిపించి విచారించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో తనను ఇబ్బందులకు గురి చేశారని ఆయన న్యాయస్థానానికి వివరించారు.