నింగిలోకి చంద్రయాన్-3.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?
Chandrayaan 3 Moon Mission : జాబిల్లి అన్వేషణకు చంద్రయాన్-3 బయల్దేరింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం-3 ఎం4.. చంద్రయాన్-3ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటల 13 సెకన్లకు రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌లతో కూడిన చంద్రయాన్-3.. ఆగస్టు 23 లేదా 24 జాబిల్లిని చేరుకోనుంది.
Chandrayaan 3 launch : రాకెట్ చంద్రయాన్-3 ని భూమి చుట్టూ ఉన్న 170X 36 వేల 500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరుస్తారు. పలు ప్రక్రియల అనంతరం అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుందని ఇస్రో వెల్లడించింది. ఈ చంద్రయాన్-3 ప్రయోగానికి బడ్జెట్ రూ.613 కోట్లు.