Chandrayaan Ganesh in Kamareddy : కామారెడ్డిలో చంద్రయాన్-3 గణేశ్.. సెల్ఫీలతో భక్తుల సందడి - Chandrayaan 3 Ganesh Idols
Published : Sep 21, 2023, 12:05 PM IST
Chandrayaan-3 Ganesh in Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలో విభిన్న రూపాలలో కొలువుదీరిన గణనాథులు పలువురిని ఆకర్షిస్తున్నాయి. సందేశాన్నిచ్చేలా, ఆలోజింపజేసేలా విభిన్న రూపాల్లో గణేశ్ ప్రతిమలను నిర్వాహకులు తీర్చిదిద్దారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3ని పోలిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెద్దబజార్లో ప్రముఖ న్యాయవాది రమేశ్ చంద్ నివాసంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణపయ్యకు జనం నుంచి విశేష స్పందన వస్తోంది.
Chandrayaan-3 Ganesh Idols : మరొక కాలనీలో మండపంలో మట్టి విగ్రహం ఏర్పాటుచేసి.. విగ్రహం చూట్టూ చంద్రయాన్ గొప్పదనం తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న కీలక శాస్త్రవేత్తల ఫోటోలను సైతం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతను తెలిపేలా.. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా గణనాథుని.. మహారాష్ట్రలోని ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి ప్రతిష్టించినట్లు తెలిపారు. శ్రీరాంనగర్ కాలనీలో.. గణనాథుణ్ని ఊడల మర్రితో ప్రత్యేక సెట్టింగ్లతో అలంకరించారు.