Chandrababu Special Arrangements in Jail: చంద్రబాబుకు ప్రాణహాని.. తగిన భద్రత కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు.. - చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు న్యూస్
Published : Sep 11, 2023, 11:00 AM IST
|Updated : Sep 11, 2023, 12:11 PM IST
Chandrababu Special Arrangements in Jail: జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను.. ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతోపాటు తగిన భద్రతనూ కల్పించాలన్నారు. ఇంటి నుంచి వచ్చిన ఔషధాలను, ఆహారాన్నీ అనుమతించండి అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు అంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. 'మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు.. ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ACB Court Ordered CBN Special Arrangements in Jail:అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు అని.. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి' అని విజ్ఞప్తి చేశారు. ఆయనకు హౌస్ అరెస్ట్‌ను అనుమతించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను నేడు దాఖలు చేయనున్నారు.