Chalivagu Project Main Canal Broke out at Hanamkonda : చలివాగు ప్రధాన కాలువకు గండి.. నీట మునిగిన వరి పొలాలు - హనుమకొండ తాజా వార్తలు
Published : Oct 29, 2023, 8:40 PM IST
Chalivagu Project Main Canal Broke out at Hanamkonda : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఆదివారం తెల్లవారు జామున గండి పడింది. ఈ సంఘటనలో నీరు వృధాగా పోవటమే కాకుండా.. సమీప పంట పొలాలన్నీ ముంపునకు గురయ్యాయి. పొట్టదశలో ఉన్న వరి పొలాల్లోకి నీరు చేరడంతో పంట పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన అధికారులు స్పందించి తూము మరమ్మతు పనులను చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి ద్వారా సుమారు 4 వేల ఎకరాల విస్తీర్ణం సస్యశ్యామలమవుతుందని.. గతంలోనే ఈ కాలువ కొంత మేర తెగినట్లు స్థానిక రైతు వివరించారు. అప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. వారు పూర్తి స్థాయిలో స్పందించలేదని రైతులు వాపోయారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారు జామున గండి పడి.. పంట పొలాలన్నీ నీట మునిగాయని ఆవేదన చెందారు.