Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై జలసంఘం సమావేశం.. కేంద్రం కీలక వ్యాఖ్యలు
Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణ లోపమైతే రాష్ట్రానిదే బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. డిజైన్లలో లోపాలుంటే దానికి జలసంఘమే బాధ్యత వహించాలని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయంపై కేంద్ర జలసంఘం లోతుగా చర్చించింది. భేటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పీపీఏ సభ్యులు పాల్గొన్నారు. డయాఫ్రం వాల్ 4 ప్రదేశాల్లో దెబ్బతిన్నట్లు వచ్చిన నివేదికపై చర్చించారు.
ఈ ఏడాది జనవరిలో ఎన్‌హెచ్‌పీసీ డయాఫ్రం వాల్‌పై ఇచ్చిన నివేదికలో 8 జాయింట్లుగా కొత్త నిర్మాణం చేపట్టాలని సూచించింది. నివేదిక మేరకు నిర్మాణాలు చేపట్టేందుకు అధ్యయనం చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. చేపట్టలేని పనులైతే దానికి సాంకేతిక కారణాలను కూడా చూపించాలని జలసంఘం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా నివేదిక ఇవ్వాలని తేల్చిచెప్పింది.
రాష్ట్రం ఇచ్చిన నివేదికపై జలసంఘం అధ్యయనం చేసి వారంలోగా మరో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. డయాఫ్రం వాల్ నిర్మాణ లోపమైతే రాష్ట్ర ప్రభుత్వం, డిజైన్లలో లోపాలుంటే జలసంఘమే బాధ్యత వహించాలని తెలిపింది. గైడ్‌బండ్‌పై ఇచ్చిన నివేదికపై మరికొంత సమాచారం కోరిన జలశక్తి శాఖ.. పూర్తి నివేదిక వచ్చాకే తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపింది. డయాఫ్రం వాల్, గైడ్‌బండ్‌పై 2 వారాల తర్వాత మళ్లీ భేటీ కావాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది.