ఏపీలో ప్రారంభమైన ఎన్నికల హడావిడి - అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఈసీ మార్గదర్శకాలు
Published : Dec 21, 2023, 8:07 PM IST
Central Election Commission Visit in AP For Two Days:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో రెండురోజులపాటు పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్‌ల బృందం రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల (డిసెంబర్) 22, 23 తేదీల్లో సీఈవో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. భేటీలో 2024 ఓటర్ల జాబితా రూపకల్పనపై ఈసీ బృందం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించనుంది. దీంతోపాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కూడా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఈసీ బృందానికి నివేదికలు సమర్పించనున్నారు. అనంతరం డిసెంబర్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది.
CEC Guidelines on Officers Transfers, Postings: మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఈవోలు, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ''ఎన్నికలతో సంబంధమున్నవారు సొంత జిల్లాలో ఉండకూడదు. దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో ఉండకూడదు. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించకూడదు. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దు. బదిలీలు, పోస్టింగుల వివరాలు జనవరి 31లోగా ఇవ్వాలి. 2024 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగుస్తుంది.'' కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది.