అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం
Published : Nov 3, 2023, 4:26 PM IST
Central Dam Safety Team Inspect Annaram Barrage : అన్నారం బ్యారేజీలో రెండుచోట్ల ఏర్పడ్డ సీపేజీని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సీపేజీపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులను కోరిన కేంద్ర జల సంఘం.. ముగ్గురు సీనియర్ ఇంజినీర్లతో కూడిన బృందాన్ని పంపింది. ఇందులో సీడబ్ల్యూసీకి చెందిన దేవేంద్రరావు, రమేశ్ కుమార్, తంగమణి ఉన్నారు. బ్యారేజీకి సంబంధించిన వివరాలను సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాదగిరి.. కేంద్ర బృందానికి వివరించారు.
Annaram Barrage Laekage Issue : డ్యాం సేఫ్టీ అధికారులు సీపేజీ ఉన్న రెండు గేట్ల ప్రాంతాన్ని పరిశీలించి.. "ఇక్కడ మాత్రమే సీపేజీ రావడానికి కారణాలు.?.. దీనిని నివారించడానికి అవసరమైన చర్యలు.? మొదలగు వివరాలు తెలుసుకొన్నారు. బ్యారేజీ సీపేజీలపై అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నామని.. తెలంగాణ ఇంజినీర్లు తెలిపారు. గతంలో ఒకసారి కెమికల్ కాంక్రీటు గ్రౌటింగ్ చేసి పూర్తిగా అరికట్టినందున ఇప్పుడు ఇక్కడ కూడా ఎలాంటి సమస్య రాదని వివరించారు. సీడబ్ల్యూసీ బృందంతో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్, కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు.