ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్‌లో కేసు - వీడియో ఫుటేజీ పరిశీలించిన పోలీసులు - Narayana Swamy
Published : Jan 14, 2024, 3:11 PM IST
|Updated : Jan 14, 2024, 7:02 PM IST
Case on AP Deputy CM Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కారణమని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఈనెల 8న తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మల్లు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. నారాయణ స్వామి ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు నిర్దారించారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ సీఐ శంకర్ తెలిపారు. దీంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై ఐపీసీ 504, 505 సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ బేగంబజార్ సీఐ శంకర్ తెలిపారు.