Car Racings Bike Stunts at Ananthagiri Hills : అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్.. నిర్వాహకుల గుర్తింపు
Car Racings Bike Stunts at Ananthagiri Hills :వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ జోరుగా సాగుతోంది. ఆగస్టు 15న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండల ప్రాంతాలకు భారీగా వెళ్లిన యువకులు.. కార్ రేసింగ్, బైక్ స్టంట్స్‌తో రచ్చ చేశారు. ప్రకృతి నడుమ కారు స్టంట్స్‌తో దుమ్ములేపుతూ అలజడి సృష్టించారు. కార్ల సైరన్లు వేసుకుంటూ మోత మోగించారు. బైక్, కారు పందాలు (రేసులు) పెట్టుకొని స్థానికులను, పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మేరకు కార్ల రేసింగ్ వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికంగా వారాంతాల్లో కార్ల రేసింగ్ జరుగుతోందని తెలిపిన స్థానికులు.. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిన్న సెలవు దినం కావడంతో వికారాబాద్ కొండల అందాలను, ఆహ్లాదాన్ని తిలకించేందుకు చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వచ్చిన సందర్శకులు కార్లు, బైక్ పందాలతో ఇబ్బంది తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేసింగ్‌కు పాల్పడిన వ్యక్తులను గుర్తించామని అటవీ శాఖ అధికారి రాజా రమణారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలేది లేదని అటవీ శాఖ తరఫున కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అడవిలోకి వెళ్లే దారులకు ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపేలా చర్యలు తీసుకోవాలని.. జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌కి సూచించామని చెప్పారు. మరోవైపు దీనిపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వివరించారు.