జలపాతంలో పడిపోయిన కారు.. డోరు గట్టిగా వేయగానే అదుపుతప్పి.. - madhya pradesh car waterfalls video
Car Falls Into Waterfall in Indore : మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని ఓ పిక్నిక్ స్పాట్ వద్ద కారు అదుపుతప్పి జలపాతంలో పడిపోయింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. అక్కడే ఉన్న సందర్శకులు వారిని కాపాడారు. నీటికి దగ్గరగా కారును పార్క్ చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ట్రంక్ డోర్‌ను గట్టిగా వేసేసరికి కారు అదుపుతప్పి నీటిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
సిమ్రోల్ ప్రాంతం పిక్నిక్ స్పాట్ కావడం వల్ల అక్కడికి చాలా మంది సందర్శకులు వచ్చారు. కారు నీటిలో పడిపోతున్న సమయంలో అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. కారులో ఓ వ్యక్తి, అతడి 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కారు నీటిలో పడగానే.. అక్కడే ఉన్న కొందరు వెంటనే దూకి వారిని బయటకు తీసుకొచ్చారు.
"జలపాతంలో కారు పడిపోవడం నేను చూశా. కారులో తండ్రీకూతుళ్లు ఇద్దరు ఉన్నారు. బయటకు వచ్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, కారు అప్పటికే నీటిలో పడిపోయింది. వారు మునిగిపోవడం చూసి నేను నీటిలో దూకేశా. కారు లో ఉన్న వ్యక్తిని కాపాడా. అతడి కుమార్తెను ఇంకెవరో రక్షించారు" అని ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సునీల్ మాథ్యూ (26) తెలిపాడు. తండ్రీకూతుళ్లు ప్రాణాలతో బయటపడటం సంతోషంగా ఉందని చెప్పాడు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందౌర్ రూరల్ ఎస్పీ సునీల్ మెహతా వెల్లడించారు. 'కారును నిర్లక్ష్యంగా నీటికి సమీపంలో పార్క్ చేశారు. ట్రంక్‌ను బలంగా మూసేయడం వల్ల కారు ముందుకు జరిగి నీటిలో పడిపోయినట్లు తెలిసింది' అని పేర్కొన్నారు.