Warangal Car Accident Today : విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. జనావాసాల్లోకి దూసుకెళ్లి.. వరంగల్ జిల్లాలో కారు బీభత్సం - తెలంగాణ న్యూస్
Car Accident in Warangal : రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. బైకులు, కార్లు కొందరు మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల దృష్ట్యా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినా ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వరంగల్-ఖమ్మం హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఇల్లంద వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారు జనావాసాల్లోకి దూసుకెళ్లడంతో ఓ ఇంటి గోడ కూలిపోయింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను గ్రామస్థులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.