నాలుగేళ్ల బాలుడిపైకి దూసుకెళ్లిన ఎద్దు.. తీవ్రగాయాలతో..
నాలుగేళ్ల బాలుడిపై ఓ ఎద్దు దాడి చేసింది. ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాతతో కలిసి బయటకెళ్లిన బాలుడిపై ఎద్దు విచక్షణారహితంగా దాడి చేసింది. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారిపై ఎద్దు దాడి చేసిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం ఉదయం జరిగిందీ ఘటన.
తానా గాంధీ పార్క్ ఏరియాలోని ధనిపూర్‌లో నివాసం ఉండే ఓ వృద్ధుడు.. తన మనవడిని తీసుకుని పని మీద బయటకు వెళ్లాడు. మార్గమధ్యలో బాలుడిని రోడ్డుపై ఉంచి.. అలా పక్కకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఎద్దు బాలుడిపై దాడి చేసింది. బాలుడిని కిందపడేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడిపై ఎద్దు దాడిని గమనించిన వృద్ధుడు.. వెంటనే అక్కడికి వెళ్లి మనవడిని రక్షించాడు. అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం జేఎన్ మెడికల్ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఎద్దును బంధించి.. వేరే చోటుకు తరలించారు.