Bull Attack Girl Viral Video : 8ఏళ్ల బాలికపై ఎద్దు దాడి.. స్కూల్‌కు వెళ్తున్నప్పుడే.. - 8ఏళ్ల బాలికపై ఎద్దు దాడి వైరల్ వీడియో
Published : Sep 6, 2023, 4:32 PM IST
Bull Attack Girl Viral Video :పాఠశాలకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఎద్దు భీకరంగా దాడి చేసింది. దీంతో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో జరిగింది. బాలికపై ఎద్దు దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నొయిడాలోని ధన్‌కౌర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన బాధిత బాలిక.. బుధవారం స్కూల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెపై ఒక్కసారిగా ఎద్దు దాడి చేసింది. చిన్నారి అరుపులు విన్న స్థానికులు.. వెంటనే ఆమెను కాపాడారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
గాజియాబాద్‌లో కుక్కకాటుకు గురై చిన్నారి మరణించిన ఘటన మరువక ముందే బాలికపై ఎద్దు దాడి చేయడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విచ్చలవిడిగా జంతువులు.. జనావాసాల్లో తిరుగుతున్నాయని చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.