లైవ్ వీడియో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం - దిల్లీలో నేలమట్టమైన భవనం వీడియో
దిల్లీలో భారీ ప్రమాదం జరిగింది. దేశ రాజధానిలోని భజన్‌పురా ప్రాంతంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. విజయ్‌పార్క్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే నేలమట్టమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక స్థానికుడు భవనం పడిపోతుండగా వీడియో తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిన ఘటనను స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే భవనం కూలినప్పుడు అందులో ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఎందుకు ఇలా జరిగిందో గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భవనం పాతగా ఉన్నందునే కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.