బాల్కనీ కూలి ఇద్దరు వృద్ధులు మృతి.. భవనాన్ని కూల్చేసిన అధికారులు - వైరల్ వీడియోలు
రెండతస్తుల భవనం బాల్కనీ కూలి ఇద్దరు వృద్ధులు మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాట్‌కోపర్‌లో ఉన్న రాజ్‌వాడి ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రిసిల్లా మిస్సోయిటా (65), రాబీ మిస్సోయిటా (70) మృతి చెందినట్లు తెలిపారు అధికారులు.
క్షతగాత్రులందరూ ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. భవనం కూడా పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది భవనాన్ని పూర్తిగా కూల్చివేసినట్లు అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన భవనంలో మొత్తం మూడు కుటుంబాలు నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రౌండ్లో ఫ్లోర్లో ఉన్న వారికి ఎక్కువ గాయాలు అయినట్లు వారు వెల్లడించారు.