Buffaloes on Cycle Track Viral Video : నానక్‌రాంగూడ సైకిల్ ట్రాక్‌పై గేదెల ర్యాంప్‌వాక్.. వీడియో వైరల్ - నానక్‌రాంగూడ సైకిల్ ట్రాక్ వైరల్ వీడియో
Published : Oct 7, 2023, 5:28 PM IST
Buffaloes on Cycle Track Viral Video : హైదరాబాద్‌లో ఇటీవల సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు ఖర్చు చేసి.. హెచ్ఎండీఏ దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది. ఇలాంటి ట్రాక్ ప్రస్తుతం గేదెలకు నిలయంగా మారింది. ఇంటర్నేషనల్ పోటీలకు వేదికగా నిలవాల్సిన ట్రాక్.. గేదెలకు నీడనిస్తోంది. సైకిళ్లు దూసుకుపోవాల్సిన ట్రాక్ మీద.. బర్రెలు హంస నడకలు నడుస్తోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గేదెల ఫ్యాషన్ షోలా ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
బాహ్యవలయ రహదారిని ఆనుకుని నానక్‌రాంగూడలో 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన సోలార్ సైకిల్ ట్రాక్‌ను మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. నానక్‌రాంగూడ నుంచి మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్ల ట్రాక్, నార్సింగి, కోకాపేట్, వట్టినాగులపల్లి మీదుగా కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్రాక్ సోలార్ రూఫ్ టాప్ కలిగి.. దీని ద్వారా 16 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్.. సైకిల్ ట్రాక్ ప్రారంభం ఒక్క అడుగు మాత్రమేనని.. నగరం మొత్తం సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలనేది తన కల అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.