Tiger viral video : యూనిటీ అంటే ఇది.. గేదెల దెబ్బకు పులి ఔట్
Buffalo Attacks Tiger Video : సాధారణంగా మనం పులి దాడిలో చనిపోయిన పశువుల గురించి వింటూంటాం.. కానీ పశువులు దాడి చేసి పులిని హతమార్చిన ఘటనను ఎప్పుడైనా చూశారా...? అటువంటి అరుదైన ఘటన తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాపూర్ జిల్లా ముల్ పరిసర ప్రాంతాల్లో గతకొంత కాలంగా పులి సంచరిస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
గురువారం రోజున ముల్ తాలూకాలోని ఎస్గాంలో పశువుల కాపరిపై దాడికి యత్నించింది. కాపరి చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. తర్వాత బెంబాడ గ్రామ పరిసరాల్లో మేతకు వెళ్లిన పశువుల గుంపుపై దాడి చేసింది. అక్కడ గేదెలు బెదరకుండా ఐకమత్యంగా పోరాడి పులిపై ఎదురుదాడి చేశాయి. గేదెలు కొమ్ములతో పొడవడంతో పులికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పశువుల కాపరులు ఈ సన్నివేశాన్ని తమ చరవాణుల్లో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులిని చికిత్స కోసం తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చిన్నప్పుడు ఐకమత్యమే మహాబలం అని ఓ పాఠం చదువుకున్నామని.. ఇది చూస్తుంటే ఆ పాఠమే గుర్తొస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.