BRS Protest aganist Revanth Reddy : 'రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పేవరకూ నిరసనలు ఆగవు' - ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
Minister Srinivas goud protest aganist Revanth Reddy : విద్యుత్ విషయంలో రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పేవరకూ నిరసనలు కొనసాగుతాయని రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. దేశమంతా తెలంగాణ నమూనా అభివృద్ధి కావాలని కోరుకుంటుంటే.. ఇక్కడి రాజకీయ నేతలు మాత్రం రైతులకు ఉచిత విద్యుత్ ఎందుకని, 8 గంటలు సరిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్ పట్టణంలోని విద్యుత్ భవనం ముందు బీఆర్ఎస్ ఆధ్యర్యంలో ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని రైతులకు భారం చేసిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. నాణ్యమైన విద్యుత్ సక్రమంగా అందించక సాగు, పారిశ్రామిక రంగం కుంటుపడ్డాయని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి నుంచి 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ కేసీఆర్ అందిస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇవాళ కరెంటు వద్దన్న వాళ్లు రేపు రైతులకు రైతుబీమా, రైతుబంధు కూడా తీసేస్తారని, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకూ గండికొడతారని ఆరోపించారు. ఎన్నికల వేళ అధికారం కోసం వచ్చే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.