BRS MPS Letter To EC About Party Symbol : 'ఈసారైనా ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు కేటాయించకండి'
Published : Sep 27, 2023, 7:42 PM IST
BRS MPS Letter To EC About Party Symbol : వచ్చే ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోలర్, రోటీ మేకర్, ఇస్త్రీ పెట్టె, కెమెరాను వేరేవారికి కేటాయించొద్దని బీఆర్‌ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ నేత కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కారును పోలిన గుర్తుల వల్ల గతంలో ఓట్లు కోల్పోయి విజయావకాశాలపైనా ప్రభావం చూపినట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కారుతో పోలి ఉన్న గుర్తులు ఉన్నందున అల్ఫాబెటికల్ సిస్టమ్ వల్ల కారు కిందనే రోలర్ ఇలాంటివి రావడం వల్ల తెలియని వారు, వృద్ధులు కారుకు వేయబోయి ఆ గుర్తులకు వేస్తున్నారని... దాని వల్ల బీఆర్‌ఎస్ ఓట్లను కోల్పోతోందని తెలిపారు.
గతంలో ఇదే విషయాన్ని ఎన్నికల అధికారులకు విన్నవించామని.. మరోసారి ఈ విషయంపై సమీక్ష చేయాలని కోరారు. ఈసీ అధికారులు కూడా... తమ విజ్ఞప్తిపై మరోమారు దృష్టి పెడతామని తెలిపారని ఎంపీలు చెప్పారు. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈసీని కోరారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ముందస్తు జాగ్రత్తతో ఈ సమస్యను ఎన్నికల సంఘానికి తీసుకెళ్లామన్నారు. ఈసీని కలిసినవారిలో ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ నేత సోమ భరత్ ఉన్నారు.