'మేం ప్రతిపాదించిన సవరణలను వెనక్కి తీసుకున్నాం - ఆ పదాలను మాత్రం రికార్డు నుంచి తొలగించాలి' - తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఫైర్
Published : Dec 16, 2023, 10:26 PM IST
BRS MLC Kavitha Objection to Governor Tamilisai Speech : గవర్నర్ ప్రసంగానికి కొన్ని సవరణలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని నిరంకుశ, నిర్భంధ ప్రభుత్వంగా దూషించారని ఆమె మండిపడ్డారు. తొలి రోజు కావడంతో సవరణలు వెనక్కి తీసుకునేందుకు ఆమె అంగీకరించారు. అయితే ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరినట్లు కవిత తెలిపారు. మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉభయసభల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని తెలిపారు.
ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని మండలిలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నామన్నారు. అందుకే మేం ప్రతిపాదించిన సవరణలు వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలని, రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్ ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.