బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి - బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి ఎన్నికల ప్రచారం
Published : Nov 21, 2023, 10:51 PM IST
BRS MLA Candidate Manchireddy Kishan Reddy Election Campaign : బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్, మునగనూర్, తొర్రూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ పనుల్లో అభివృద్ధి సాధించిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతున్నారని, కచ్చితంగా మరోసారి గులాబీ పార్టీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామా మల్లేశ్, దండం రామ్ రెడ్డి, కొత్త కురుమ సత్తయ్య, అమరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.