'రాష్ట్ర ఆర్థిక వనరులను బంగారు పళ్లెంలో అప్పగిస్తే - అప్పుల పాలు చేశారనడం సరికాదు' - బీఆర్ఎస్ నాయకుడు వినోద్ ప్రెస్ మీట్ కాంగ్రెస్ పై
Published : Dec 14, 2023, 10:27 PM IST
BRS EX MP Vinod Fire on Congress :బంగారు పళ్లెంలో రాష్ట్ర ఆర్థిక వనరులను అప్పగించామని, అప్పుల రాష్ట్రం అని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్న ఆయన, రిజర్వ్ బ్యాంకు నివేదికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. పదేళ్ల కాలంలో ఎంతో శ్రమించి కేసీఆర్ సాధించిన రాష్ట్ర ఆర్థిక వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని వినోద్ సూచించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు.
EX MP Vinod Comments on Government :కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల ఆర్థిక వనరుల కన్నా తెలంగాణ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని వినోద్ అన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ 84.2 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. అభివృద్ధి సాధించాయని చెప్పుకునే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ వంటి అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక వనరుల సాధనలో దేశంలోనే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 400 శాతం ఉత్పత్తులు పెరిగాయని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగిందని వివరించారు.