బ్రిజ్ భూషణ్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ కార్యకర్తలు!
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సభలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది..
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ గోండాలో ఓ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిజ్ భూషణ్‌తో సెల్ఫీ దిగుతుండగా.. రెండు వర్గాల ఆయన మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. వివాదం కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. సహనం కోల్పోయిన ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలతో దాడులకు దిగడమే కాకుండా.. రాళ్లు రువ్వుకున్నారు. ఎంపీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.
'బీజేపీదే విజయం'
అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఎంపీ బ్రిజ్ భూషణ్.. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయనున్నట్లు ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.