Bridge Washed Away Nizamabad : 'మా రోడ్డెక్కడో పోయింది.. కనిపించడం లేదు' - Heavy Rains in Telangana
Bridge Washed Away Nizamabad Rains :వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 21 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి డిచ్‌పల్లి మండలం మాధవనగర్ గుడి ఎదుట ఉన్న మినీ వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే గుడి ఎదుట రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు 10 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్- కంటేశ్వర రోడ్డు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ రైల్వే పైవంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా మినీ వంతెనను నిర్మించారు. దీనిపై భారీ వాహనాలకు అనుమతి లేనప్పటికీ ఇదే రహదారిలో రాకపోకలు సాగించడంతో వంతెన మొదట కుంగిపోయింది. మిగిలిన భాగం మంగళవారం రోజున నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.