Golconda Bonalu Begins Today : ఆషాఢ బోనాలకు ముస్తాబైన భాగ్యనగరం
Golconda Bonalu Celebrations Begins Today :ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్టమొదటగా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి బోనాల జాతరలో పాల్గొంటున్నారు. అమ్మా బైలెల్లినాదో.. తల్లి బైలెల్లినాదో.. అంటూ భక్తుల కోలాహలం మధ్య అమ్మవారు బోనాల పండుగ మొదలైంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయింపులతో కోట కళకళలాడుతోంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు వరుసగా శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు తీసుకొచ్చారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో కుండ, రాగి పాత్రలలో నైవేథ్యం వండి అమ్మవారికి సమర్పించారు. అలాగే లంగర్ హౌస్లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే తొట్టెల ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొని.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో నెల రోజుల పాటు జంట నగరాలు సందడిగా మారనున్నాయి.