Bommala Koluvu Festival : 4,500 బొమ్మల కొలువు.. రామాయణం, మహాభారతం చిన్నారులకు ఈజీగా అర్థమయ్యేలా ఏర్పాటు - దసరా బొమ్మల కొలువు
Published : Oct 18, 2023, 9:54 AM IST
Bommala Koluvu Festival :దసరా సందర్భంగా సుమారు 4,500 బొమ్మలను ప్రదర్శించారు కర్ణాటకకు చెందిన ఓ మహిళ. దావణగెరెలోని వినోభానగర్కు చెందిన చంద్రిక.. గత 22 ఏళ్లుగా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆమెను 'దసరా బొమ్మల కొలువు చంద్రిక'గా పిలుస్తున్నారు స్థానికులు. పదిరోజుల పాటు సాగే ఈ బొమ్మల కొలువును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు దాదాపు నెల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు చంద్రిక. పేపర్, చెక్క, ఇత్తడి, క్లే, పత్తి, వస్త్రం, వైర్లతో అందంగా రూపొందిస్తారు. బొమ్మల కొలువులో చివరి రోజున ఊయలలో వేసి పూజలు చేసి తీసివేస్తారు. బొమ్మల పైన ఆసక్తి కలిగిన చంద్రిక.. ఎక్కడికి వెళ్లినా కొనుగోలు చేసి తీసుకువస్తారు. కొండపల్లి, మధురై లాంటి ప్రాంతాల నుంచి ఈ బొమ్మలను సేకరించారు. దసరా సమయంలో వీటన్నింటిని ఒకే దగ్గర పెట్టి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.
వీటిలో దశవతారాలు, అనంత పద్మనాభ స్వామి, బకాసుర బొమ్మలతో రైతు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. మహాభారతం, రామాయణంలోని పాత్రలను సైతం ఈ బొమ్మల కొలువులో ఉంచారు. "గత 22 ఏళ్లుగా నా ఇంట్లో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నాను. చిన్నారులకు మన పురాణగాథలు సులభంగా అర్థమయ్యేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాను." అని చంద్రిక తెలిపారు.