Bogatha Waterfalls in Telangana : పాలనురగలా బొగతా జలపాతం.. సందర్శకుల మనసు పరవశం.. - బోగత జలపాతం
Bogatha Waterfalls in Mulugu District :తెలంగాణ నయాగరాగా పేరు పొందిన బొగత జలపాతం పొంగి పొర్లుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో బొగత జలపాతం ఉవ్వెత్తున ఎగిసి పెడుతుంది. అల్పపీడన ద్రోణితో నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి పునుగోలు మీదుగా కొండ కోనల నుంచి వచ్చిన వరద నీరు బొగత జలపాతం చేరుకొని 50 అడుగుల ఎత్తుతో నీటి ధారలు ఎగసిపడుతున్నాయి. భారీ వర్షాలకు జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులు రాకుండా అటవీ శాఖ అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పడినందున అటవీ శాఖ అధికారులు శనివారం నుంచి సందర్శనకు అనుమతించింది. దీంతో పర్యాటకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జలపాతం సోయగాలను ఆస్వాదిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు అయినందున వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బొగత జలపాతం వద్ద జాలువారిన నీటితో పక్కనే అటవీ శాఖ అధికారులు నీటి కొలను ఏర్పాటు చేశారు. దాని చుట్టు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. జాలు వారుతున్న నీటి సవ్వడుల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. రైలు మార్గం అయితే వరంగల్ ప్రధాన జంక్షన్. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి.