చిల్లర నాణేలతో నామినేషన్‌కు వచ్చిన జహీరాబాద్ బీఎంపీ అభ్యర్థి, నిరాకరించిన రిటర్నింగ్ ఆఫీసర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 7, 2023, 6:00 PM IST
BMP Candidate Came to Nomination With Coins : చిల్లర రాజకీయాలకు చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ చిల్లర నాణాలతో నామినేషన్ వేసేందుకు వచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రూ.10 నాణాలతో వచ్చి నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకునేందుకు రిటర్నింగ్ అధికారి ఒప్పుకోకపోవడంతో నోట్ల రూపంలో రూ.5000 రుసుమును చెల్లించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నాణేలను రిటర్నింగ్ అధికారులు తీసుకోకపోవడం పట్ల అభ్యర్థి చంద్రకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సొంతంగా నాణేలను తయారు చేయలేదని చలామణిలో ఉన్న నాణేలను అధికారులు తీసుకోకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో అడుగు పెట్టడమే లక్ష్యంగా చిన్నప్పటి నుంచి చిల్లర నాణాలు దాచుకొని కష్టపడి చదివి న్యాయవాదిగా పనిచేస్తూ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని ప్రకటించారు. అధికారులు తిరస్కరించిన నాణేలను పేదలకు దానం చేసి తన ప్రచారాన్ని ప్రారంభిస్తానని చంద్రకాంత్ ప్రకటించారు.