డ్రోన్ ద్వారా బ్లడ్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి! - blood bags icmr latest news
దేశంలోనే తొలిసారి డ్రోన్ ద్వారా రక్తాన్ని రవాణా చేసింది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్). ది గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS), లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్(LHMC)ల నుంచి సేకరించిన 10 యూనిట్ల రక్తం ప్యాకెట్ల నమూనాలను ఈ డ్రోన్ ద్వారా తరలించారు. ఈ ప్రయోగాన్ని ఉత్తర్‌ప్రదేశ్ నొయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (JIIT) దగ్గర చేపట్టారు. సంప్రదాయ పద్ధతితో పోల్చితే.. డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగులను తరలించే విధానంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భాల్.
"ఆరోగ్య రంగంలో ఈ ఐ-డ్రోన్ సేవలను ఇంతకుముందు కొవిడ్ విజృంభణ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఐసీఎమ్ఆర్ ఉపయోగించింది. వీటి ద్వారా వ్యాక్సిన్ల అవసరం ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అధిక సంఖ్యలో వ్యాక్సిన్ డోస్‌లను సరైన సమయంలో సరఫరా చేయగలిగాము. కొన్ని ప్రాంతాలకు వీటిని రోడు మార్గంలో పంపాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ రకంగానే దేశంలో అనేక ప్రయోగాలు చేశారు. దీని ద్వారా ఔషధాలను కూడా పంపిణీ చేశారు. ఈ ఐ-డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే రక్తంతో పాటు దాని అనుబంధ ఉత్పత్తులు కూడా సరఫరా అవుతున్నాయి. రక్తం పాడవ్వకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అంబులెన్స్‌ల ద్వారా పంపే సంప్రదాయ పద్ధతికి ఈ ఐ డ్రోన్లకు పెద్ద తేడాల్లేవు. పైగా రోగికి సకాలంలో బ్లడ్ అందించడమే కాకుండా మెరుగైన ఫలితాలు వచ్చాయి. మున్ముందు ఈ ఐ డ్రోన్ వ్యవస్థను దేశమంతటా విస్తరిస్తాము. భవిష్యత్‌లో కేవలం రక్తం, మందులు మాత్రమే కాకుండా అవయవాలను కూడా సరఫరా చేయాలని అనుకుంటున్నాము." అని వివరించారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భాల్.