చేతబడి నెపంతో దారుణం.. వృద్ధ దంపతులకు గుండు కొట్టించి గ్రామంలో ఊరేగింపు - ఝార్ఖండ్ లేటెస్ట్ న్యూస్
ఝార్ఖండ్లో దారుణం జరిగింది. చేతబడి చేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులను దారుణంగా హింసించారు వారి గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు. దంపతులకు గుండు కొట్టించి ఊరంతా ఊరేగించారు. దీంతో భాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లాతెహార్ జిల్లాలోని మహుందర్ పోలీస్స్టేషన్ పరిధిలోని భేడీగాంధార్లో ఇటీవలే ఓ వ్యక్తి మరణించాడు. అయితే అదే గ్రామంలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులు మద్యం మత్తులో... అతన్ని చేతబడి చేసి ఎవరో చంపారని చెప్పారు. దీంతో వారిద్దరే అతన్ని చేతబడి చేసి చంపినట్లు గ్రామస్థులు భావించారు. దీంతో వారిని బలవంతంగా లాక్కెళ్లి దారుణంగా కొట్టి హింసించారు. అనంతరం వారిద్దిరికీ గుండు కొట్టి.. సున్నం పూశారు. ఆ తర్వాత వారిని గ్రామంలో ఉరేగించారు. వారికి శుద్ధి(వారినుంచి మంత్ర విద్యలను దూరం చేయడం) చేసేందుకు గ్రామస్థులంతా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దీనిలో భాగంగా కోడి, మేకను బలిచ్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గ్రామస్థులకు ఉన్న ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.