మజ్లిస్‌తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదు : రఘునందన్ రావు - తెలంగాణ బీజేపీ వార్తలు
Published : Dec 9, 2023, 5:16 PM IST
BJP Raghunandan Rao Condemns to Kadiyam Comments :తెలంగాణలో కొత్తగా రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటై రెండు రోజులు కాకముందే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటిన స్థానాలు గెలుచుకుందని, ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ, ఎంఐఎం పార్టీలను కలుపుకొని ఏర్పాటవుతుందనటం పట్ల భారతీయ జనతా పార్టీకు ఎలాంటి సంబంధ లేదన్నారు.
మజ్లిస్‌తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు. చివరకు ఇవాళ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం పట్ల బీజేపీ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతున్న కడియం శ్రీహరి మాటలను తప్పపట్టారు. ఒక సీనియర్ సభ్యుడిగా ఆ వ్యాఖ్యలు సరికాదన్నారు.