'తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే చంద్రబాబు పోటీకి దూరం' - telangana assembly election 2023
Published : Nov 4, 2023, 9:04 PM IST
BJP MP Dharmapuri Arvind Comments on Chandrababu Naidu: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా.. ప్రభుత్వం నిర్వహించేది మాత్రం బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అర్వింద్.. రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు వెనుక నుంచి మద్దతు ఇచ్చేందుకు తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. అనంతరం పలువురుని కలుస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానించి.. కమలం కండువా కప్పారు. కాంగ్రెస్కు 30 నుంచి 40 సీట్లు వస్తాయని.. ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది బీజేపీతోనే అని అన్నారు. పసుపు రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతుల కల నెరవేర్చారన్నారు. అలాంటి ప్రధానికి ఇప్పుడు మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించడం పెద్ద పనేమీ కాదన్నారు. చెరకు రైతులు ఆలోచించి.. నామినేషన్లు వేయకుండా బీజేపీకి మద్దతు తెలపాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని హెచ్చరించారు. చెరకు రైతులందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని అరవింద్ కోరారు.