సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించిన ఎమ్మెల్యే.. లైవ్ వీడియో - సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించిన ఎమ్మెల్యే
సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను ఓ ఎమ్మెల్యే ప్రాణాలకు తెగించి రక్షించారు. మత్స్యకారుల బోటు సాయంతో యువకులను ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించడం వల్ల ఈ వీడియోలు కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోని రాజులా అనే తీర ప్రాంతంలో నలుగురు యువకులు సముద్రం దగ్గరకు వెళ్లారు. స్నానం చేయాలనుకున్న వారంతా సముద్రంలోకి దిగారు. ప్రమాదకర స్థాయి దాటి లోపలికి వెళ్లడం వల్ల వారు కొట్టుకుపోయారు. దీంతో అక్కడున్న కొందరు స్థానికులకు సమాచారం ఇచ్చారు.
స్థానికులతోపాటు కొందరు మత్స్యకారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకి కూడా అక్కడకు వెళ్లారు. వెంటనే సముద్రంలోకి దూకిన ఆయన.. కొట్టుకుపోతున్న ముగ్గురు యువకుల వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు మరికొందరు మత్స్యకారులు, యువకులు తోడుగా వెళ్లారు. ముగ్గురిని ఓడ వద్దకు తీసుకురాగలిగారు. అయితే మరో యువకుడు మాత్రం కనిపించలేదు. సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టగా ఆ తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. ప్రాణాలకు తెగించి యువకుల ప్రాణాలను రక్షించిన హీరా సోలంకికి ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.