అప్పులపై శ్వేతపత్రం ఇస్తే కొత్త అప్పులు ఎట్లా పుడతాయి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Published : Dec 20, 2023, 7:41 PM IST
BJP MLA Alleti Maheshwar Reddy Reaction on Debts :గత ప్రభుత్వం కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకువచ్చిందని, ప్రాజెక్టులు అంత అద్భుతంగా ఉంటే ఆర్బీఐ వద్దకు వెళ్లి ఎందుకు అప్పులు తీసుకురాలేదని బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. సభలో హరీష్‌రావు అబద్దాలు ఆడటం సరైంది కాదని, బూటకపు అబద్దాలతో పదేళ్లు పాలన సాగించారని ధ్వజమెత్తారు. శాసనసభలో అర్థిక శ్వేతపత్రంపై జరిగిన చర్చలో బీజేపీ తరపున మహేశ్వర్ రెడ్డి తన వాదనలను బలంగా వినిపించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు నియంత పాలన సాగించిందని ఆరోపించారు. హరీష్‌రావు కేంద్రంపై పదే పదే విమర్శలు చేస్తున్నారని గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆయన కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Maheshwar Reddy Fires On BRS : లక్షల కోట్లు కేంద్రం నుంచి సహాయం పొంది కేంద్రంపై నెపం నెట్టడం సమంజసం కాదని హితవు పలికారు. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ధ్వంసం చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని హామీలు అమలు చేయకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని తెలిపారు. రాష్ట్ర అప్పులపై శ్వేత పత్రం ఇస్తే కొత్త అప్పులు ఎట్లా పుడతాయని ప్రశ్నించారు. పన్నులు పెంచి ప్రజల మీద భారం మోపుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బిజినెస్ పేరుతో మంత్రి శ్రీధర్ బాబు సభను అభాసుపాలు చేశారని మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.