నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు.. బైక్‌పై వచ్చి షూట్ చేసి, పరార్ - bjp leader shot dead in moradabad
Bjp Leader Shot Dead in Moradabad : ఉత్తర్‌ప్రదేశ్‌లో నడి రోడ్డుపై భాజపా నేతను దారుణంగా హత్య చేశారు. మొరాదాబాద్‌లో స్థానిక రాజకీయ నేత అనూజ్ చౌదరి.. మరొకరితో కలిసి ఆయన ఇంటి ముందు నడుస్తుండగా దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వెంబడించిన ముగ్గురు హంతకులు జరిపిన కాల్పుల్లో.. అక్కడికక్కడే అనూజ్ కుప్పకూలారు. మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శ్వనాథ్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. అనూజ్ శరీరంలోకి చాలా బుల్లెట్లు దూసుకెళ్లాయని పోస్టుమార్టం అనంతరం వైద్యులు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులే ఆయనను హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. మొత్తం నలుగురిని అనుమానిస్తున్నామని.. వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశామని వారు వివరించారు. ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది.
అయితే అపార్ట్మెంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ.. దుండగులు ఎలా వచ్చి, పారిపోయారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల పరిషత్ అధ్యక్షుడి భర్తే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత మండల పరిషత్ అధ్యక్షుడు సంతోష్ దేవీపై అనూజ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడని.. అందుకే అతడ్ని చంపేశారని చెబుతున్నారు. అనూజ్ చౌదరి బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడని పోలీసులు వెల్లడించారు.