Laxman Fires on BRS Government : 'బీఆర్ఎస్ పాలనలో ఏ కోణం చూసినా కుంభకోణమే' - తెలంగాణ తాజా వార్తలు
Mahajan Sampark Abhiyan at LB Nagar : పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పని చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి నాగోల్‌లోని ఓ గార్డెన్లో మహాజన్ సంపర్క్ అభియాన్ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణ్.. గత ఎన్నికల సమయంలో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసిందని అందుకోసం ప్రగతి నివేదికల కోసం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎక్కడా అవినీతి జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసం రూ.27 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. ఎక్కడ అవినీతి, దళారీ వ్యవస్థ లేకుండా డిజిటల్ చేసి డైరెక్ట్‌గా పేదవారందరికీ సేవలు అందిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఏ కోణం చూసినా కుంభకోణమేనని పేర్కొన్నారు. అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ట్విటర్ టిల్లు కేటీఆర్ ట్విటర్లో రెచ్చిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో నియంత్ర పాలన పోయి, రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నుంచి బీజేపీ గెలుపునకు శ్రీకారం చుడతామన్నారు. దశాబ్ద ఉత్సవాల పేరిట బీఆర్ఎస్ రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, రానున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లి వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.