కేంద్రం నిధులిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి - సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలి : బండి సంజయ్ - కరీంనగర్లో బండి సంజయ్ రోడ్ షో
Published : Nov 14, 2023, 2:06 PM IST
BJP Bandi Sanjay Election Campaign in Karimnagar : సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్.. బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే.. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తానని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఓటు వేసే ముందు కరీంనగర్ ప్రజలు, యువత.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపిస్తే.. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని బండి సంజయ్ పేర్కొన్నారు.
కమలం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని.. రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. నేడు రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఒకటో తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు.