గుజరాత్‌ను వణికించిన బిపోర్‌జాయ్.. 140 కి.మీ వేగంతో గాలులు.. భారీగా ఆస్తి నష్టం! - biporjoy cyclone maharashtra
గుజరాత్లో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 140 కి.మీ వేగంతో గాలులు వీయటం వల్ల.. ఎన్నో చెట్లు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు సైతం కుప్పకూలాయి. తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న వాహనాలు చెల్లాచెదురయ్యాయి. తుపాను పట్ల నిత్యం అప్రమత్తంగా ఉన్న అధికారులు.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా 631 మంది వైద్య సిబ్బందిని, 504 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అదే విధంగా నావిక దళం, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్గాల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా.. ముమ్మరంగా సహాయక చర్యల్లో భాగం పంచుకుంటున్నాయి.
కరెంట్ స్తంభాలు పడిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నేలకొరిగిన చెట్లను తొలగిస్తూ.. కుప్పకూలిన కరెంట్ స్తంభాలను తిరిగి అమర్చుతున్నారు. తుపాను వాయువ్య దిశగా కదులుతున్నందున శుక్రవారం, శనివారం రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా ఈ సాయంత్రం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు.