మహిళా అధికారిపై ఇసుక మాఫియా దాడి - bihar female Mining Inspector sand mafia
మహిళా అధికారిపై అత్యంత అమానుషంగా దాడి చేశారు ఇసుక మాఫియా సభ్యులు. పోలీసులతో కలిసి సోదాలకు వెళ్లిన ఆమెను.. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. బిహార్లోని పట్నా జిల్లా బిహ్టాలో సోమవారం జరిగిందీ ఘటన.
బిహ్టాలో ఇసుక వ్యాపారులు.. లారీలలో ఓవర్లోడింగ్ చేస్తున్నారని అధికారులకు సమాచారం అందించింది. వెంటనే పట్నా జిల్లా మైనింగ్ విభాగం ప్రధానాధికారి కుమార్ గౌరవ్.. ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. పోలీసుల అండతో తనిఖీలు చేపట్టారు. రోడ్డు పక్కన లారీలు ఆపి సోదాలు చేస్తుండగా.. ఇసుక మాఫియా సభ్యులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాళ్లు, కర్రలతో మైనింగ్ విభాగం అధికారులు, పోలీసులపై దాడికి దిగారు. ప్రాణభయంతో పోలీసులు సహా ఇతర అధికారులంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో కుమార్ గౌరవ్తోపాటు మహిళా మైనింగ్ ఇన్స్పెక్టర్లు ఆమ్యా, ఫర్హీన్, మరికొందరు గాయపడ్డారు.
దాడి సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఇసుక మాఫియాపై విరుచుకుపడ్డారు. మైనింగ్ విభాగం అధికారులపై దాడి చేసిన కేసులో 44 మంది అరెస్టు చేసినట్లు పట్నా (పశ్చిమం) ఎస్పీ రాజేశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం స్పందించింది. వీడియోలో కనిపిస్తున్న నిందితులను గుర్తించి వెంటనే పట్టుకోవాలని సీఎం నీతీశ్ కుమార్.. ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఆర్జేడీ నేత శివానంద్ తివారీ వెల్లడించారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు.