Big Fish in Bhupalpally : లక్ అంటే ఇదే.. పొలంలో 15 కిలోల చేప - Bhupalapally District News
Bhupalpally Rains Today : సాధారణంగా చేపలు చెరువుల్లో, కుంటల్లో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పొలాలు కూడా చెరువులుగా మారిపోయాయి. పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో చెరువులన్నీ అలుగుపారుతున్నాయి. వరద ఉద్ధృతికి చేపలన్నీ పొలాల్లోకి వచ్చాయి. తాజాగా ఓ రైతుకు తన పొలంలో 15 కిలోల బరువున్న వాలుగ చేప దొరికింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి రైతు పొలం పనుల నిమిత్తం వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. అక్కడ భారీ 15 కిలోల వాలుగ చేప ఉండడంతో చూసి ఆశ్చర్యపోయారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పైనుంచి వస్తున్న వరదకు.. తన పొలంలో ఈ చేప కొట్టుకువచ్చి ఉంటుందని అన్నారు. తాను ఇంత పెద్ద చేపను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు పొంగిపొర్లడంతో.. అలుగుల వద్ద చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. మరోవైపు ఈనెల 24వ తేదీ నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.