పుట్టిన రోజు నాడే పునర్జన్మ.. 20 గంటలు మృత్యువుతో పోరాడి.. - భీవండీలో పుట్టిన రోజు ప్రాణాలుతో బయటపడ్డ వ్యక్తి
Bhiwandi Building Collapse : పుట్టినరోజు నాడే పునర్జన్మ పొందాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర భివండీలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండంతస్తుల భవనం కూలింది. భవన శిథిలాల్లో చిక్కుకున్న సునీల్ పిసాల్ అనే 38 ఏళ్ల వ్యక్తి.. 20 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఆదివారం శిథిలాల కింది నుంచి అతడి మాటలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది.. సునీల్‌ను సురక్షితంగా బయటకు తీసి పట్టున రోజు నాడే పునర్జన్మ ప్రసాదించారు.
శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు. గాయపడిన 13 మందిని సహాయక బృందం ఆస్పత్రికి తరలించింది. కూలిన భవనం.. గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో ఓ గోదాము ఉంది. పైన అంతస్తులో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సునీల్ పిసల్ కింద అంతస్తులో ఉన్న గోదాములో పనిచేస్తున్నాడు. అయితే, భవనం కూలిన సమయంలో సునీల్‌తో పాటు మరో 15 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.