Bhatti On Udandapur Project : 'భూ నిర్వాసితులను అధికారుల చుట్టూ తిప్పుతున్నారు' - ఉదండాపూర్ ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క
Bhatti Vikramarka On Udandapur Project : అమాయకులైన ఉదండాపూర్, వల్లూర్ గ్రామ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసి వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని కోరిన ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వ పెద్దలు, అధికారులు పెడుతున్న ఇబ్బందులపై భూ నిర్వాసితుల బాధితులతో నేడు భట్టి మాట్లాడారు. భూ నిర్వాసితులు తమ భూమిని కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయించి, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే అవేవి బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కచేయట్లేదని ధ్వజమెత్తారు. అధికార బలంతో బీఆర్ఎస్ కోర్టు ఆర్డర్లు ఉన్న భూములలో పనులు చేస్తూ అడగడానికి వెళ్లిన భూ నిర్వాసితులను అధికారుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు మేలు చేసే విధంగా.. న్యాయ బద్ధంగా చట్టానికి లోబడి పని చేయాలని ఉదండాపూర్ ప్రాజెక్టు నుంచి నిర్వాసితుల తరపున న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ని భట్టి కోరారు.