విద్యుత్ దీపకాంతులతో మెరుస్తున్న భద్రాద్రి.. - sri ramanavami
Srirama navami at Bhadradri temple : సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని భద్రాది రామయ్య సన్నిధిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామనవమి వేడుక సందర్భంగా ఈ ఆలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఆలయం నలువైపులా అలంకరించిన విద్యుత్ దీపాలు స్థానికులను భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీరామనవమి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవస్థానం రంగులతో ముచ్చటగొల్పుతోంది. భక్తులు స్థానికులు రంగురంగుల విద్యుత్ దీపాల వద్ద సెల్ఫీలు దిగటానికి ఆలయం వద్దకు కదిలి వస్తున్నారు.
కల్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీరాముని విశిష్టత తెలిపేందుకు ఇసుకతో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వాముల ప్రతిమలను తయారు చేశారు. భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం రెండు లక్షల లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తోంది. లడ్డూల తయారీలో నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బూంది సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భక్తులకు సులభంగా లడ్డు ప్రసాదాన్ని అందించడానికి 30 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.