పాపికొండల విహారయాత్ర - రద్దీ దృష్ట్యా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని బోట్ టూరిజం సూచన - Papikondalu boat tour ticket booking online
Published : Dec 25, 2023, 1:51 PM IST
|Updated : Dec 25, 2023, 2:17 PM IST
Bhadrachalam Papikondalu Tour :పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని బోట్ టూరిజం కోరుతోంది. వరుస సెలవులు రావడంతో భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్లే విహారయాత్ర కోసం పర్యాటకులు అధిక సంఖ్యలో కదిలి వస్తున్నారు. ఈ క్రమంలో బోట్ టూరిజం కీలక ప్రకటన చేసింది.
సాధారణంగా భద్రాద్రికి వచ్చిన భక్తులు రామయ్యను దర్శించుకొని పాపికొండలను చూసి వెళ్తుంటారు. ఇక్కడ చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన పకృతి పచ్చదనం, మంచు దుప్పటి కప్పిన కొండకోనలు, గలగల పారుతున్న గోదావరి సవ్వడులు, గిరిజనుల సాంప్రదాయ నృత్యాల నడుమ పాపికొండలు కొత్త అందాలను సంతరించుకున్నాయి.
పాపికొండల యాత్రలో ఈ అందాలు చూసేందుకు నైట్‌హాల్ట్ కోసం భారీగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకులు బోట్ విహార యాత్ర కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయించడం వల్ల ఈనెల 31 వరకు టికెట్ బుకింగ్ ఫుల్ అయ్యాయి. దీంతో www.tsboattourism.com ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న తర్వాతే భద్రాచలం పాపికొండల యాత్రకు రావాలని టూరిజం శాఖ సూచించింది.