కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
Published : Dec 14, 2023, 3:35 PM IST
Bhadrachalam Mukkoti Utsavalu 2023 : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రామచంద్ర స్వామి వారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో రెండో రోజైన నేడు శ్రీరామచంద్ర స్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలోని స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామి వారు బజారు సేవకు బయలుదేరారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Sri Sitaramachandra Swami in Kurmavataram: కూర్మావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, శని గ్రహ బాధలు తొలగుతాయని ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు తెలిపారు. ఉత్సవాల్లో మొదటి రోజు మత్స్యావతారం, రెండో రోజు కూర్మావతారం, మూడో రోజు వరాహావతారం, నాలుగవ రోజు నరసింహావతారం, ఐదో రోజు వామనావతారం, ఆరవ రోజు పరశురామ అవతారం, ఏడో రోజు శ్రీరామ అవతారం, ఎనిమిదవ రోజు బలరామావతారం, తొమ్మిదవ రోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు.