Bear Wanders in Karimnagar : నన్నెవడ్రా ఆపేది.. పట్టపగలే దర్జాగా రోడ్లపై తిరుగుతున్న ఎలుగుబంటి - Karimnagar District News
Bear Wanders in Karimnagar :కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. రాత్రివేళ పట్టణ శివారు ప్రాంతాల్లో భల్లూకం సంచరిస్తూ స్థానికులను కలవరపెడుతుంది. అర్ధరాత్రి సమయంలో బొమ్మకల్ పరిధిలోని శ్రీపురం, రజ్వీ చమాన్ రోడ్లపై ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో.. తెల్లవారుజాము వరకూ నిద్ర లేకుండా గడుపుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో.. యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కొద్దిసేపటి తర్వాత ఎలుగుబంటి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Bear Hulchal in Karimnagar : అయితే శుభం గార్డెన్ ఏరియాలో కూడా ఎలుగుబంటి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంటి ఆనవాళ్లు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణ రేకుర్తిలో జనావాసాల మధ్య ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎలుగుబంటిని పట్టుకునేందుకు వరంగల్ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. 4 గంటల పాటు శ్రమించి.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది బంధించారు.