Basara RGUKT Issues : బాసర ఆర్జీయూకేటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం - బాసర యూనివర్సిటీ అప్డేట్స్
Basara RGUKT Issue : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటి యాజమాన్యం ప్రవర్తనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులంతా వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లిన సమయంలో.. వసతిగృహంలో ఉన్న వారి సామగ్రి, పుస్తకాలు అన్నీ వారి గదుల్లో నుంచి తీసి బయటపడేశారు. ఈ నెలలో సెకండ్ సెమ్ పరీక్షలు ఉండడంతో విద్యార్థులు యూనివర్సీటీకి చేరుకున్నారు. హాస్టల్‌లో వెళ్లి చూడగా గది అంతా ఖాళీగా కనిపించింది. దీంతో విద్యార్థులు తమ పుస్తకాలు, వస్తువుల కోసం వెతకగా ఓ చోట పడేసి ఉన్నాయి.
కొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయని.. తాము ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో ఆర్జీయూకేటీ అధికారులు స్పందించారు. విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఓ ప్రకటనలో తెలిపారు. అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత తమ వస్తువులను తీసుకెళ్లడం సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అందులో భాగంగానే విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేసిందని తెలిపారు. గదులు శుభ్రపరిచే క్రమంలో గుర్తించిన విలువైన వస్తువులను ప్రత్యేక గదిలో భద్రపరిచామన్నారు.